Friday, May 1, 2009

నీ మాయలో పడ్డానురా ......

నీ ఓదార్పు నాకివ్వగలదు ముందుకు దూసుకెళ్ళే శక్తిని
నీ చిరుకోపం నింపుతుంది నాలో సరికొత్త చిలిపితనాన్ని
నీ మాటల మాధుర్య ధ్వనిలో మరిచిపోతాను కాలాన్ని,చుట్టూ వున్న ప్రపంచాన్ని
ఎన్ని జన్మలకైనా నువ్వు నా వాడివి ,నేను నీ దానిని ...

నా యావత్తూ నీకు అర్పితం ...

నా కళ్లు నీకోసం చూస్తున్నప్పుడు ,
నా మనసు నీ గురించి ఆలోచిస్తున్నప్పుడు,
అందమైన ఆలోచనలు నా హృది యంతా కలియతిరుగుతున్నప్పుడు ,
నేననుభవించే అనంతమైన ఆ అనుభూతి నీకూ ఎప్పుడైనా నా వల్ల సొంతమైతే
నా జన్మ సార్ధకం ,నా యావత్తూ నీకు సగర్వ సమర్పితం ..

పిచ్చి ప్రేమ ..ప్రేమ పిచ్చి

ప్రేమే పిచ్చిదైతే ,మరి ప్రేమించే వాళ్ళంతా ?
పిచ్చి ని మరీ ఇంత పిచ్చి గా ప్రేమించే ప్రేమికులున్నారా?
ప్రేమ పిచ్చిది కాదు ,ఆ భావనే పిచ్చి దైతే బాగుండు ...

మంచి-చెడు

నువ్వు మనిషివి ,మంచిని-చెడుని కలుపుకు తిరిగే అల్పుడివి ..
ఏది మంచి -ఏది చెడు అని విడదీసి చెప్పి నీ మనసుకు నువ్వు సమాధానం చెప్పుకోలేని అధముడివి ..
నీ మానవ సమూహం లో ఏ మనిషి చెప్పగలడు నే మంచోణ్ణి,నే చెడ్డోణ్ణి అని నిర్భయంగా-నిర్భీతిగా ..
చెప్పాలని ఉన్నా ,స్వరపేటికని బలంగా నొక్కిపట్టే మనస్సాక్షి అన్నివేళలా అడ్డుపడుతూనే వుంటుంది ..
ప్రయత్నించు నువ్వైనా చెప్పగలవేమో..

నాగరిక సమాజంలో ఎవడికి తోచింది వాడు చేసేస్తాడు ,అనుకూలిస్తే మంచి అంటాడు -కాకపోతే చెడంటాడు
నువ్వు నేర్చుకునే భాషలోనే ప్రకృతి -వికృతి కలగలిసి ఉన్నాయ్ .. ఇంక నా చేత నువ్వు కొత్తగా మంచి-చెడు చెప్పించుకునేదేముంది?
మంచి-చెడు ల భావన పక్కకి తోసేసి ,కార్యసాధనలో బతికేస్తున్న జీవులే నేటి సమాజంలో అడుగడుగునా తారసపడుతున్నారు కాలర్ ఎగరేస్తూ ...

హింసే నేటి కమర్షియల్ ఎలిమెంట్ దేవుడా....

విపరీత ధోరణి ప్రజల్లో ప్రబలుతోంది అదేదో కలరాలా ,మలేరియా లా ..
ఆదిపత్య అహంకారంతో మెలగటమే హీరోయిజం అన్న భావన ఉదృతం అవుతోంది జనంలో ...
బహుశా ,ఏలిన ప్రభువుల వారసత్వం సంక్రమించి ఉండొచ్చు నా జాతి ఆలోచనల్లోకి ...
రౌడీ గాడే నాయకుడు ,నాయకుడంటే రౌడీ లాగే వుండాలి అన్న వాదానికి గిరాకీ పెరిగిపోతోంది ..

"కడప కింగ్ " లకే ఇక్కడ బహుళ జనాదరణ ,గాంధీ సినిమా లు నచ్చట్లేదు నా అభ్యుదయ దేశ భక్తులకు ...
ఫైట్లు ,ఫీట్లు కాలానికి సూపర్ హిట్లు..వాటికే మస్తు గిరాకీలు..
ఎక్కడో జరిగిన క్రైమ్ ని రాత్రికి మోసుకొచ్చే వాళ్లు బాగా నచ్చారేమో నా సమాజం లోని క్రైమ్ వాచర్లకి ...
నేరమన్నది ఘోరమన్న రోజులు పోయి ,సహజమన్న రోజులు ముందుకొచ్చేస్తున్నాయి..

గాంధీలను పక్కన పెట్టి ,గాడ్సే లు ముందుకు వచ్చేస్తున్నారు ...
ఎందుకీ ధోరణి ఇంత లోతుల్లోకి వెళ్లిపోయింది ? ఎందుకు మనం దానికి బానిసలమైపోతున్నాం ?
ప్రభుత మారాలి, ప్రజలు మారాలి అని స్పీచులు దంచే నా నవ యవ్వన సమాజం ఈ వింత విషాన్ని గురించి ఒక్కసారైనా అధ్యయనం చేసిందా?
చేతిలో సరదాగా గన్ పట్టుకు తిరిగే అమెరికా బేబీ కల్చర్ కన్నా ,మెదడు లో ఇంత కాలకూటాన్ని మెల్లగా ఎక్కించుకుంటున్న నా భారత యువత అంటేనే భయం వేస్తోంది ...


(నాలుగు -ఐదు సంఘటనల్ని చూసి , నలుగురి మాటల్ని విని , చుట్టూ ఉన్న సమాజాన్ని విశ్లేషించాక పుట్టిన అనుభవాల్లోంచి ...)